'మా ఇంటి బంగారం' కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం వచ్చింది: సమంత

  • నా నిజ స్వరూపానికి 'స్వర్ణ' పాత్ర చాలా దగ్గరగా ఉంటుందని వెల్లడి
  • సినిమాలో డూప్ లేకుండా రియలిస్టిక్ యాక్షన్ చేశానని స్పష్టం
  • ఈ చిత్రం కోసం నిజంగానే దెబ్బలు తిన్నా, రక్తం చిందించాన‌న్న‌ సమంత
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'. ఇవాళ‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఆమె, ఈ సినిమాలోని తన పాత్రకు ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యారో వివరించారు. 'మా ఇంటి బంగారం'లోని స్వర్ణ పాత్రలో ఉన్న 'దృఢ సంకల్పం' అనే ఒక్క లక్షణం తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆ పాత్రతో ప్రేమలో పడేలా చేసిందని ఆమె వెల్లడించారు.

ఇంతవరకు తాను తెలుగులో పోషించిన పాత్రలన్నింటిలోకీ, తన నిజ స్వరూపానికి అత్యంత దగ్గరగా ఉన్న పాత్ర 'స్వర్ణ' అని సమంత పేర్కొనడం విశేషం. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయాన్ని తెలిపారు. ఇది ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇక, ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల గురించి మీడియా సమావేశంలో సమంత మాట్లాడుతూ.. "ఈ సినిమాలో ఎక్కడా స్లో మోషన్ షాట్స్, బిల్డప్ షాట్స్ వంటివి ఉండవు. యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. అవి నిజమైన పంచులు. వాటి చిత్రీకరణ సమయంలో నాకు కూడా దెబ్బలు తగిలాయి, రక్తం వచ్చింది. అన్ని యాక్షన్ సీన్స్ నేనే స్వయంగా చేశాను. అందుకే అవి ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవుతున్నాయి" అని వివరించారు. 

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో, రెండేళ్ల నిరీక్షణ తర్వాత తన ప్రియుడి ఇంటికి వచ్చిన స్వర్ణకు అక్కడ పలు ప్రశ్నలు ఎదురవుతాయి. కులం, వంట, తోబుట్టువులు వంటి ప్రశ్నలతో ఆమెను విసిగిస్తారు. అయితే, "నేనెవరో మీకు తెలుసా?" అని ఆమె ఎదురు ప్రశ్నించడం ఉత్కంఠ రేపుతుంది. "కోడలికి అందం, సన్నగా ఉండటం, వంట చేయడం వంటి ఎన్నో లక్షణాలు ఉండాలని ఆశిస్తారు. కానీ నాలో ఆ లక్షణాలు ఏవీ లేవు. నాలో ఒకే ఒక్క గుణం ఉంది. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను" అని ఆమె చెప్పే డైలాగ్, పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తెలియజేస్తుంది. ఈ డైలాగ్ ద్వారానే చిత్ర కథాంశం ఏమిటో స్పష్టమవుతోంది.

Samantha
Maa Inti Bangaram
Samantha Ruth Prabhu
Maa Inti Bangaram Movie
Samantha Action Scenes
Swarna Character

More Telugu News